జులై 8.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను వరుసగా రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్‌ఆర్..తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్, 108 వంటి సేవల పేరు చెబితే ముందుగా గుర్తుకువచ్చేది వైఎస్‌ఆరే. దురదుష్టవశాత్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలలకే.. 2009 సెప్టెంబరు 2 హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్..కాంగ్రెస్‌తో విభేదించి ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. అనంతరం తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కొద్దిలో అధికారాన్ని అందుకోలేకపోయిన జగన్..2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఏపీ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో 151 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టారు. జగన్ బలపడిన సమయంలోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ మెల్లగా అంతరించిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు నచ్చని ప్రజలు.. మెల్లగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గారు. ఇప్పటికీ జగన్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీదే.