రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు రెండు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంపై వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని విజయసాయిరెడ్డి ఎండట్టారు. జీతాలు ఎప్పుడిస్తారంటూ ఆయన ట్వీట్ చేశారు. పలు ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104 ఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు.
విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా సమగ్ర శిక్ష ఎస్పీడీ చర్యలు తీసుకుని, సంబంధిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.