ఎన్నికల తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిన గులాబీ పార్టీ క్యాడర్ ను గాడిన పెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 29న దీక్షా దివస్ తో మళ్లీ డోస్ పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రోజు నుంచి జిల్లా పార్టీ ఆఫీసులో పార్టీ కార్యక్రమాల నిర్వహణ మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీక్షా దివస్ కు ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది.
మరో నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష పార్టీగా చురుగ్గా వ్యవహరించాలంటే పార్టీ కేడర్ ను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కార్యాలయాల ద్వారా ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు మొదలు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, వరంగల్ మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీటిని ప్రారంభించినా నిర్వహణ లోపంతో అవి నామ మాత్రంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వాటన్నింటిని యాక్టివేట్ చేయాలనే వ్యూహాలు రచిస్తోంది బీఆర్ఎస్.