ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఉహించని షాక్ తగిలింది. మొత్తం 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది. ఇందులో మరీ దారుణంగా కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. అలాగే మరో రెండు నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచి డిపాజిట్లు దక్కించుకుంది. అయితే ఎన్నికల అనంతరం ఎన్నికల అధికారి పోటీలో నిలిచిన అభ్యర్థులకు సెక్యూరిటీ డిపాజిట్‌లను చెల్లించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ క్రమంలో తీసిన డేటా ప్రకారం మొత్తం 699 మంది అభ్యర్థుల పోటీలో నిలవగా అందులో 555 మంది అభ్యర్థుల తమ డిపాజిట్లను కోల్పోయారు.
డిపాజిట్లు కోల్పోయిన 555 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 67 మంది ఉన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఇంత దారుణంగా ఓడిపోవడం అందర్ని షాక్ కు గురిచేసింది. ఇదిలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ ఎల్‌జెపి అభ్యర్థులందరూ తమ సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోగలిగారు. 2013 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 67 మంది అభ్యర్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్లను కోల్పోయారు. పార్టీ నుంచి రెండో స్థానంలో నిలిచిన ఏకైక నాయకుడు కస్తూర్బా నగర్ నుండి అభిషేక్ దత్, నంగ్లోయ్ జాట్ నుండి రోహిత్ చౌదరి, బద్లీ నుండి దేవేంద్ర యాదవ్ తమ సెక్యూరిటీ డిపాజిట్లను కాపాడుకోగలిగారు.