కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్షీణిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జనవరి-మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ నివేదికపై ఆయన స్పందించారు. దేశవ్యాప్తంగా టాప్ -7 నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని సాధించగా హైదరాబాద్, కోల్ కతా పట్టణాల్లో మాత్రం క్షీణత కనిపించిదని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ఐటీ పార్కులను ప్లాన్ చేయడానికి ముందు తొలి త్రైమాసికంలో హైదరాబాద్ లో ఆఫీస్ లీజింగ్ లో 41 శాతం క్లీణతను పరిష్కరించాలన్నారు. ఈ తిరోగమణం దేశవ్యాప్తం జరుగుతున్నదని కాదని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్ సీఆర్, ముంబయి, పూణే వంటి నగరాలు గణనీయమైన వృద్ధిని సాధిస్తుంటే హైదరాబాద్ మాత్రం తిరోగమనంలో ఉందని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు క్షీణించడంపై ప్రభుత్వం తన పనితీరు పట్ల ఆత్మపరిశీలన చేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు.