హాంకాంగ్, సింగపూర్‌లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండటం మరింత కలవరం పెడుతోంది. హాంకాంగ్‌లో కోవిడ్-పాజిటివ్ కేసుల శాతం రోజురోజుకూ పెరుగుతోంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటించింది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా, వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు.
సింగపూర్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మే 3 నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకు ముందు ఏడు రోజులతో పోలిస్తే 28 శాతం పెరిగి 14వేల200కు చేరుకుంది. రోజువారీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక చైనా విషయానికి వస్తే అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం, దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతోంది. మే 4 వరకు ఉన్న ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.