గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా వారి వివాదంలో భాగంగా జూన్ 1 నుంచి థియేటర్లను క్లోజ్ చేయాలి ఎగ్జిబిటర్ల లోని ఓ వర్గం నిర్ణయించింది. కాగా ఈ వ్యవహారంపై ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ సీరియస్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం కాస్త పెను దుమారంగా మారడంతో నిర్మాత అల్లూ అరవింద్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు లు స్పందించారు. కేవలం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడంపై మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని, ఈ వివాదం వెనుక ఉన్నవారేవరో తేల్చాలని హోం శాఖ కు మంత్రి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
సినిమా హాళ్ల నిర్వాహణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. సినిమా హాల్స్ బంద్ నిర్ణయం వెనుక ఉన్న శక్తులేమిటో తేల్చాలని ఆదేశించారు. అలాగే ఈ కుట్ర వెనుక జనసేన నాయకులు ఉన్నా చర్యలకు వెనకడుగు వేయవద్దని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణ పై సినిమాటోగ్రఫీ శాఖ సమన్వయం చేస్తుందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. అలాగే ఇకపై రాష్ట్రంలో విడుదలయ్యే సినిమాల టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఇకపై కేవలం ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని, ఇది తాను నటించిన హరిహర వీరమల్లు సినిమాకు కూడా వర్తిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.