తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం దుమారం రేపుతున్నది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారన్న కారణంగా పలువులు టాలీవుడ్ యాక్టర్లు, సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్లు, యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తుండగా తాజాగా ఈ వ్యవహారంలో స్టార్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి రావడం టాలీవుడ్ లో కలకలం రేపుతున్నది. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ప్రచారం చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఈ కేసును తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకోగా మరో వైపు టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా బెట్టింగ్ చిక్కుల్లో దొరికిపోతుండటం హాట్ టాపిక్ గా మారింది.
ఆహా అనే ఓటీటీ యాప్ లో బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో లో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్ లోడ్ చేసుకుని రూ.88 లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు శ్రీరాంబాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని నిరూపించేందుకు ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారని ఇది నిజమే అనడానికి ప్రభాస్, గోపీచంద్ కు బాలయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఫన్ 88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు.