ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను గద్దె దింపేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి చేస్తున్న కుట్రను ప్రజలు గమనించాలని .. ఈసారి ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని, జగన్ కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు అని స్పష్టం చేశారు. సైకిల్ బాగా తుప్పు పట్టిపోయిందని, అందుకే ఢిల్లీ నుంచి మెకానిక్ లను పిలిపించుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. పూర్తిగా డ్యామేజి అయిన సైకిల్ ను తాము బాగు చేయలేమని ఢిల్లీ మెకానిక్ లు తేల్చి చెబితే, పిచ్చిచూపులు చూస్తున్న చంద్రబాబు బెల్ కొట్టడం మొదలుపెట్టాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ బెల్ పేరే మేనిఫెస్టో అని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటేనని, అందుకు నిదర్శనం 2014 నాటి టీడీపీ మేనిఫెస్టోయేనని పేర్కొన్నారు.
బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఒక్కటైనా ఉందా : సీఎం జగన్
