కులగణన సర్వే-2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారం సేకరించాం మొత్తం తెలంగాణలో 96.9 శాతం సర్వే చేశామని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు-17.43 శాతం, ఎస్టీలు- 10.45 శాతం, బీసీలు- 46.25శాతం, ముస్లీం మైనార్టీల్లో బీసీలు- 10.08 శాతం, ముస్లీం మైనార్టీలు కలుపుకుని బీసీలు- 56 శాతం, రాష్ట్రంలో ముస్లింలతో సహా మొత్తం ఓసీలు- 15.79 శాతం ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు.. జనాభా లెక్కల్లోనూ బలహీన వర్గాల లెక్కలు పొందుపరచలేదని సీఎం పేర్కొన్నారు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామని వెల్లడించారు.