ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గాంధారి వాసులు కల త్వరలోనే నిజం కానుంది. గాంధారీలో మీని స్టేడియం ఏర్పాటు చేయాలని స్థానిక యువతతో పాటు ప్రజలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను గుర్తించిన కాంగ్రెస్ నేత మదన్ మోహన్.. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే గాంధారీలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో కాంగ్రెస్ నేత మదన్ మోహన్‌ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల ప్రచారంలో గాంధారి వాసులకు ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టి సారించారు.
గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించారు. ఎంత స్థలం, ఎన్ని నిధులు కావాలనే అంశంపై స్థానిక అధికారులతో చర్చించి అంచనాల ప్రాతిపాదనలను రెడీ చేయించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిసి.. గాంధారిలో మినీ స్టేడియం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్ సెక్రటరీ సిద్ధు వెల్లడించారు. గాంధారీలో మినీ స్టేడియం ఏర్పాటుకు ఎల్లారెడ్డి రెవెన్యూ అధికారులు 5 ఎకరాల స్థలాన్ని సేకరించారని సిద్ధు తెలిపారు.