బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి లో భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్‌పై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు మూడు పెగ్గులు వేసి కేసీఆర్ వరంగల్ సభ కు వచ్చినట్లున్నాడని సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలను విధ్వంసం చేశారని, ఉద్యమకారుడి బిడ్డ అని చెప్పుకునే కవిత న లిక్కర్ స్కాం చేసి తెలంగాణ పరువు తీసిందని అన్నారు. 8 నెలల ముందే మద్యం షాపులకు టెండర్లను పిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం పై మాట్లాడడానికి కేసీఆర్‌కు సిగ్గు ఉండాలని పేద, మధ్యతరగతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పుకొచ్చారు.