గర్భిణీలు గాలి కాలుష్యానికి గురైతే..

pregnat-14-.jpg

పారిశ్రామికరణ, విపరీతంగా పెరిగిపోతున్న వాహనాలు కారణం ఏదైనా ప్రస్తుతం వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాల్లో గాలి కాలుష్యం ఓ మెజార్‌ సమస్యగా మారుతోంది. గాలి కాలుష్యం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలకు, చర్మ సమస్యలకు గాలి కాలుష్యం కారణమవుతుందని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.

అయితే కడుపులో ఉన్న బిడ్డపై కూడా గాలి కాలుష్యం తాలుకు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గర్భధారణ సమయంలో మహిళ గాలి కాలుష్యంకు గురైతే పుట్టిన పిల్లలు ఆటిజం బారినపడే అవకాశం ఉంటుందని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా చిన్నతనం నుంచి గాలి కాలుష్యానికి గురైన వారిలో కూడా ఆటిజం సమస్య తప్పదని అంటున్నారు.

గాలి కాలుష్యం చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్‌ జెరూసలేం పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. పీఎం 2.5 స్థాయి, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లతో కూడిన సాధారణ గాలి కాలుష్యం పిల్లల్లో మెదడు ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘జర్నల్‌ బ్రెయిన్‌ మెడిసిన్‌’ నివేదిక ప్రకారం, ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపం కారణంగా చాలా మంది పిల్లలు అనేక వ్యాధుల బారినపడుతున్నారు. అందులో ‘ఆటిజం’ అనే సమస్య కూడా ఒకటని చెబుతున్నారు.

Share this post

scroll to top