శాసనమండలి ఆవరణలో ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ లు ఆకస్మికంగా నిరసనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ప్లకార్డులు చేతబట్టుకుని నిరసన తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇవ్వాలంటూ బంగారం కడ్డీల నమూనాలను ప్రదర్శిస్తూ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన జంటలు తులం బంగారం కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీలు కామెంట్ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేదలు ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు ఇబ్బందులు పడకూడదనే కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.లక్షపైకు పైనే ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ నేతలు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని నేడు అధికారంలోకి రాగానే ఆ విషయంపై విస్మరించారని ఫైర్ అయ్యారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఖాతాల్లో జమ చేస్తామని మాయ మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హెచ్చరించారు.