రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలంతా ఎండలు దంచికొడుతుంటే సాయంత్రం మాత్రం ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో నిన్న పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎండలు ఉంటాయని తెలిపింది.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటలకు 40-50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.