ఆపరేషన్ సిందూర్ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్‌కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ టార్గెట్ చేసినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్తాన్ దాడులు చేస్తుందనే అనుమానం నేపథ్యంలో భారత్ ఈ రక్షణ వ్యవస్థల్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది. చైనా డెవలప్ చేసిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లు దెబ్బతిన్నాయని, లాహోర్‌లో పాక్ సైన్యానికి రక్షణ లేకుండా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రష్యా S-300 వైమానిక రక్షణ వ్యవస్థ తరహాలో చైనా కాపీ వెర్షన్ HQ-9ని తయారు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత క్షిపణుల్ని HQ-9 వ్యవస్థ గుర్తించలేదు. గురువారం ఉదయం, లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలో వరుస పెద్ద పేలుళ్లు వినిపించడంతో సైరన్లు మోగాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని వార్త కథనాలు వచ్చాయి. లాహోర్ కంటోన్మెంట్ ఉండే ప్రాంతంలో డ్రోన్ దాడులు జరిగినట్లు పాకిస్తాన్ చెబుతోంది. దీంతో లాహోర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. లాహోర్ విమానాశ్రయాలన్ని పూర్తిగా మూసేశారు. సియాల్‌కోట్, కరాచీ విమానాశ్రయాలను కూడా మూసేస్తున్నట్లు సమాచారం.