ప్రెగ్నెన్సీ టైమ్ చాలా విలువైనది. ఈ సమయంలో మనం తీసుకునే కేర్.. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే కడుపుతో ఉన్నప్పుడు పారాసెటమాల్ ట్యాబ్లెట్ వాడొచ్చా లేదా అనే విషయంపై పరిశోధన చేశారు నిపుణులు. ఎసిటమినోఫెన్ అని కూడా పిలువబడే ఈ డ్రగ్ గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి అత్యంత సురక్షితమైన నొప్పి నివారిణిగా పరిగణించబడుతున్నప్పటికీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ తో కనెక్షన్ ఉందని సరికొత్త పరిశోధన గుర్తించింది.
మెదడు అభివృద్ధి విషయంలో ఆందోళనలను లేవనెత్తుతుంది. ఎసిటమినోఫెన్ దశాబ్దాల క్రితం ఆమోదించబడినప్పటికీ ఇప్పుడు FDA ద్వారా రీవాల్యూయేషన్ చేయవలసి రావచ్చు అంటున్నారు పరిశోధకులు. కడుపులో పిండంపై దీర్ఘకాలిక నాడీ అభివృద్ధి ప్రభావాలను తక్కువ అంచనా వేయకూడదని అంటున్నారు. గర్భధారణ సమయంలో ఎసిటమినోఫెన్ అతి తక్కువ మోతాదులలో ఉపయోగించినప్పుడు తక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడుతున్న వారు ఈ డ్రగ్ ఎఫెక్ట్‌ను తిరిగి అంచనా వేయాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నారు.