టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ హరి హరవీరమల్లు సినిమా కొత్త విడుదల తేదీ వచ్చేసింది. జూన్ 12వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, పవన్ రాజకీయాలతో బీజీ కావడం వల్ల షూటింగ్ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. దీంతో విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు.
ఇక రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మాట వినాలి, కొల్లగొట్టినాదిరో పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ సింగిల్ హీరోగా నటించిన చిత్రం విడుదల కాక చాలారోజులు అయింది. పైగా 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్‌కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ మూవీలో పవన్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాబీ దేవోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు.