ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. సింగూర్ ప్రాజెక్టు నిండడం వల్ల ఆయకట్టు రైతాంగానికి రెండు పంటల సాగుకు ఢోకా ఉండదని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకొని జలకళ సంతరించుకోవడం సంతోషకరమన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువకు నీరు వదిలామన్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకుండలా మారడంతో ఈ ప్రాంతమంతా సాగునీటితో సస్యశ్యామలం కానుందన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలోని టూరిజం పార్కును సందర్శించారు. పార్కులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు.
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద..
