ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మార్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. బెంచ్‌లో ఏడుగురు న్యాయమూర్తులు ఉండగా ఆరుగురు జడ్జిలు అనుకూలంగా తీర్పునిచ్చారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం వర్గీకరణ కుదరదన్నారు. దీంతో 6:1 నిష్పత్తితో ధర్మాసనం తీర్పును వెలువరించింది. దీని వల్ల ఎస్సీ ఎస్టీల్లోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇది చాలా గొప్ప తీర్పన్న రేవంత్ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్లకు కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. ఈ మేరకు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని రేవంత్ ప్రకటించారు.