రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండుకుండలా మారాయి. కొన్నిప్రాంతాల్లో చెరువులు, కాల్వలకు గండ్లు పడటంతో గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లాను మున్నేరు వాగు ముంచేత్తింది. పలు కాలనీలు జలదిగ్భంధం అయిన విషయం తెలిసిందే. వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం చివరి బాధితుడి వరకు సాయం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందిస్తామని అన్నారు. సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరదలు తోడై తీవ్రంగా నష్టం వాటిల్లింది. వరదల కారణంగా నష్టపోయిన జిల్లాలను ప్రభావిత జిల్లాలుగా ప్రకటించాం. ఒక్కో శాఖ పరిధిలో ఎంత నష్టం జరిగిందనే విషయంపై అంచనాలు వేసేందుకు అధికారులను నియమించారు. కేంద్రానికి పొందుపర్చాల్సిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాం. రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల 358 గ్రామాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు రెండు లక్షల మంది నష్టపోయారు. బాధితు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.