తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ రెండో విడత నిధులను విడుదల చేసింది. లక్షన్నరలోపు రుణం ఉన్న 6.40 లక్షల రైతులకు మాఫీ చేసింది, అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో మనీ జమ చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆగస్ట్ నెలలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనీ ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని, రెండు లక్షల రుణ భారం తీరి, నిజమైన స్వేచ్ఛను పొందుతారని అన్నారు. ఈ జులై, ఆగస్ట్ నెలలు దేశ చరిత్రలోనే లిఖించదగ్గ నెలలని అభివర్ణించారు. 12 రోజుల్లోనే రూ.12 వేల కోట్ల రుణం మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పట్టిందని సీఎం రేవంత్ అన్నారు. రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరనీ, తమ ప్రభుత్వ ప్రణాళికలను ఎవరూ ప్రశ్నించలేరని సవాలు విసిరారు. ఏకకాలంలో రూ.31 వేల కోట్లు కేటాయించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ, దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని అన్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీల నేతలకు రైతులు గుర్తుకు వస్తారని సీఎం అన్నారు. ఇప్పుడేం ఎన్నికల్లేవని, ఓట్లు లేవని.. రాజకీయ ప్రయోజనాలు కాదు.. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు.
అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లోకి మనీ..
