సంక్రాంతి తరువాత రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనుండగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నారు.
నేటి సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా విధివిధానాలపై కీలక చర్చ జరగనుంది. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఆర్థిక సాయం, పంట నష్ట పరిహారం, వ్యవసాయ రంగానికి మద్దతు అంశాలపై డిస్కస్ చేయనున్నారు. రైతు భరోసాకు కటాఫ్ ఎంత పెట్టాలి, ఎన్ని ఎంత సీలింగ్ ఉండాలి కౌలు రైతులను ఆదుకోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే, సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులను విడుదల చేసే యోచనలో సర్కార్ ఉండటంతో నేటి సమావేశంలోనే విధివిధానాలను ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా గురుకులాల్లో విద్యార్థులకు అందించే మెనూపై కూడా ఈ భేటీలో సమీక్షించనున్నారు.