సూర్యాస్తమయం తరువాతే కూల్చివేతలు ఎందుకు..

hidra-30.jpg

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆ సంస్థ కమిషనర్‌ రంగనాథ్‌ వర్చువల్‌గా, అమీన్‌పూర్ తహసీల్దార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. ముందుగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారనే అంశంపై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. విచారణ సందర్భంగా ధర్మాసనం ‘హైడ్రా’పై ప్రశ్నల వర్షం కురిపించింది. కేవలం శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తరువాతే కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. సెలవు రోజుల్లోనే అందరికీ నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేయడానికి కారణం ఏంటని అడిగింది. శని, ఆదివారాల్లో నిర్మాణాలను కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులు ఉన్నాయనే విషయాన్ని ధర్మాసనం హైడ్రాకు గుర్తు చేసింది.

జనం ఇళ్లు ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. కోర్టు అర్డర్ల విషయం కూడా తెలియదా అంటూ తహసీల్దార్‌ను ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం ఎందుకు పని చేయాలని కోర్టు ఆక్షేపించింది. ఉన్నతాధికారులను మెప్పించేందుకు ఎవరూ చట్ట విరుద్ధంగా పని చేయవద్దని ధర్మాసనం సూచించింది. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా అని మండిపడింది. పొలిటికల్ బాస్‌లను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పని చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి అధికారులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తే నేరుగా ఇంటికి వెళ్లాల్సి వస్తుందని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. అనంతరం అమీన్‌పూర్ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సమాధానమిస్తూ ఎమ్మర్వో విజ్ఞప్తి మేరకే తాము చర్యలు తీసుకున్నామని ధర్మసనానికి తెలిపారు. అందుకు కోర్టు ఎమ్మార్వో అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా అయన అడిగితే చార్మినార్, హైకోర్టు కూడా కూల్చేస్తారా అని ప్రశ్నించింది.

Share this post

scroll to top