ఇవాళ భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి. ఆయన జయంతిని తెలుగు రాష్ట్రాలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాయి. తెలంగాణ భవన్ లో మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా పీవీ చిత్రపటం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, పీవీ కూతురు ఎమ్మెల్సీ వాణి దేవి , మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం పీవీ చరిత్ర నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. పీవీ నరసింహా రావు గొప్ప సంస్కరణల శీలి అని తెలిపారు. భూ సంస్కరణలో భాగంగా తన కుటుంబానికి చెందిన 800 ఎకరాలను మహనీయులు దారాదత్తం చేశారన్నారు. జైళ్ల శాఖ మంత్రిగా కూడా ఓపెన్ జైల్ విధానంతో సంస్కరణలు చేశారన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని సైతం పూర్తికాలం సమర్థవంతంగా నడిపారన్నారు. పీవీ గొప్పతనాన్ని గుర్తించి భారత రత్న ప్రకటించిన కేంద్రానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
చరితపై చెరగని ముద్ర పీవీ కేటీఆర్..
