అధికారంలో ఉన్నన్నాళ్లు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్డీయే సర్కార్ ప్రతిపాదించిన వక్ఫ్ బిల్లుకు తాము వ్యతిరేకమని సంచలన ప్రకటన చేసింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇలా వైఎస్సార్‌సీపీ స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు.
విజయవాడలోని కుమ్మరిపాలెం, ఈద్గా మైదానంలో ఆదివారం వక్ఫ్ పరిరక్షణ మహాసభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్‌తో కలిసి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత విజయసాయిరెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వక్ఫ్ బిల్లుపై సూటిగా స్పష్టమైన ప్రకటన చేశారు. ముస్లిం హక్కులకు భంగం కలిగే చట్టాన్ని అంగీకరించమని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో 9 అంశాలకు వ్యతిరేకంగా లేఖ రాసి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.