ఇకపై సినిమా విడుదలకు ముందు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. టికెట్ల రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. శనివారం నాడు మంత్రి శాసన సభలో మాట్లాడుతూ ఇక మీదట హీరోలు కూడా థియేటర్లకు వెళ్లవద్దని సూచించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి ఈ డబ్బులు అందజేస్తామని పేర్కొన్నారు.
తొక్కిసలాలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ వైద్య ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రేవతి కుటుంబానికి పరిహారం ఇస్తానని చెప్పి అల్లు అర్జున్ హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమాలకు ప్రత్యేక మినహాయింపులు ఉండవని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అల్లు అర్జున్ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి సినిమాలు తీసుకోండి వ్యాపారం చేసుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు పొందండి ప్రోత్సాహకాలు అందుకోండి షూటింగ్‌లకు ప్రత్యేక అనుమతులు తీసుకోండి కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగిన తర్వాత ప్రత్యేక మినహాయింపులు ఉండవు అని స్పష్టం చేశారు.