సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ భారీ ఊరట లభించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు 50 వేల పూచీకత్తుతో రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు ఇద్దరు వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించాలని షరత్తులు విధిస్తూ నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది.