కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు అభాసు పాలవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. రేషన్ కార్డులు, తులం బంగారం, రుణమాఫీ, అనర్హులను ఎంపిక చేయడంపై ప్రజలు తిరగబడుతున్నారు. గ్రామ సభల్లో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు తరిమి తరిమి కొడుతున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క చోట కూడా గ్రామ సభలు సజావుగా సాగలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతున్నది.
తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అక్రమాలు జరగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరులు లంచాలు లేనిదే పని చేయడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామసభలో అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. లంచం తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటు వేస్తే మమ్మల్ని మోసం చేశారని శాపనర్ధాలు పెడుతున్నారు.