అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ నల్లగొండ పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నాను నిర్వహించనున్నారు. క్లాక్ టవర్ వేదికగా నిర్వహిస్తున్న రైతు మహా ధర్నాకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు హాజరు కానున్నారు. రైతు మహా ధర్నాలో పాల్గొనేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చే అవకాశం ఉంది.
మహా ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లు బీఆర్‌ఎస్ జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మహా ధర్నాను నిర్వహించాల్సి ఉంటుంది. ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణ మాఫీ , చేసిన రుణ మాఫీ, రైతు భరోసా కింద మూడు విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై సర్కార్‌ను నిలదీయనున్నారు. అయితే, ఈనెల 21 మహా ధర్నా జరగాల్సి ఉండగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉండటంతో పోలీసులు పర్మీషన్ ఇవ్వలేదు.