మహాకుంభమేళాలో అపశృతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య రోజున రెండో అమృత్‌స్నానం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సంగం వద్ద అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తెల్లవారుజామున రెండున్నర గంటల తర్వాత నుంచి ఘాట్‌లోకి భక్తుల్నిఅనుమతిచ్చారు. ఈ సమయంలో సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా మందుకు తోసుకొచ్చారు.
దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 40 మందికిపైగా భక్తులకు గాయాలైనట్లు పేర్కొంటున్నారు. గాయాలైన వారిని సెక్టార్-2 ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు మరణించినట్లు సమాచారం. సంగం వద్ద జరిగినతొక్కిసలాట తీవ్ర గందరగోళం, భయాందోళనల వాతావరణాన్ని సృష్టించింది. అనేక అఖారాలు షాహీ స్నాన్‌ను రద్దు చేశాయి. మౌని అమావాస్య నాడు పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్ జనసంద్రంగా మారింది.