కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే తక్షతణమే కేంద్రానికి మద్దతును ఉపసంహరించుకోవాలన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై నిలదీయాలని చంద్రబాబుకు రాసిన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న నరేంద్ర మోదీ రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూటమి పార్టీ ఎంపీలు తమ గళాన్ని విప్పాలని సూచించారు. 10 ఏళ్లు హోదా ఇస్తామని ప్రధాని హామీని ప్రశ్నించాలన్నారు. కూటమి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోతే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని హెచ్చరించారు. 2014లో బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తుందని ఎన్డీయేలో భాగస్వామ్యమై కేంద్ర క్యాబినెట్‌లో పదవులు అనుభవించారని, ప్రస్తుత కేంద్ర మంత్రి వర్గంలోనూ ప్రాతినిధ్యం అనుభవిస్తున్న దృష్ట్యా హోదాపై స్పందించాలని డిమాండ్ చేశారు.