పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ఈ పోలీస్ స్టోరీ కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ‘స్పిరిట్’కు సంబంధించి మరో క్రేజీ రూమర్ నెట్టింట వైరలవుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజగా ఇదే విషయంపై ఆర్జీవీ స్పందించాడు. తన లేటెస్ట్ సినిమా ‘శారీ’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న వర్మ స్పిరిట్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్పిరిట్ సినిమాలో నేను నటిస్తున్నానన్న వార్తలయితే నిజం కాదు. ఫస్ట్ దీని గురించి సందీప్ రెడ్డి వంగా నన్ను అడగలేదు. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలు కూడా నాకు పెద్దగా తెలియవు. ఇక కల్కి సినిమా గురించి అంటారా! ఈ టీమ్‌లో చాలామంది నాకు తెలిసినవారే. వాళ్ల కోసమే ఆ సినిమాలో అతిథి పాత్రలో నటించాను. చాలా సరదాగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి అలాంటిది ఊహించలేదు. దాంతో వాళ్లందరూ సర్‌ప్రైజ్ ఫీలయ్యారు. నా పాత్ర వారికి బాగా నచ్చింది’ అని చెప్పుకొచ్చాడు వర్మ. తద్వారా స్పిరిట్ సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్తలను రూమర్లేనని కుండ బద్దలు కొట్టేశాడు.