కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ మాజీ మంత్రి టీ. హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ, కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని తెలిపారు. ఎవరైనా చెట్టు నరకాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం కూడా చెట్లు రక్షించాల్సిందే, అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్వయంగా చెట్లు నరికిందని ఆరోపించారు. ఈ విషయంలో TGIIC స్వయంగా పోలీసులను సంప్రదించి రక్షణ కోరిన విషయాన్ని గుర్తుచేశారు. చెట్లు నరుకడమే కాకుండా, ఆ చర్యల వల్ల మూడు జింకలు మృతి చెందాయి.
ఇది వైల్డ్ లైఫ్ ఆక్ట్ సెక్షన్ 29 ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్షకు దారితీయవచ్చు, అని తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన RS ప్రవీణ్ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేవలం అటవీ భూములే కాదు, పట్టా భూముల్లోనూ చెట్లు నరుకకూడదన్నట్లు అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది, అని హరీష్ రావు గుర్తుచేశారు. 2011లో ఇక్కడ లక్ష మొక్కలు నాటారు. అప్పటి ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ స్వయంగా ఒక చెట్టు నాటి, ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు అవన్నీ 15 ఏళ్ల వయస్సు గల పెద్ద చెట్లు అయ్యాయని, అలాంటి చెట్లను నరుకడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.