నేడు హైదరాబాద్ లో ప్రముఖ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించిన ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, ఈ సమరాలు ప్రజల మీదే అవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మూడున్నర లక్షల మంది, మీరు చేపట్టిన సమరం 97 శాతం ప్రజల మీదేనా? అంటూ ప్రశ్నించారు.
ఉద్యోగులకు జీతాలు లేకపోతే ప్రభుత్వం ముందుగానే చొరవ తీసుకుని చెల్లింపులు ప్రారంభించిందని అన్నారు. పదవీకాలాన్ని 61 ఏళ్లకు పెంచాం, కానీ అందుకు అనువైన లాభాలు ఇవ్వకుండా ఉండేందుకు కాకుండా, ఉద్యోగుల ప్రయోజనాల కోణంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు. ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న 9 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వాల వల్ల పెండింగ్ అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు ‘సమరం’ అంటూ పోరాటానికి దిగుతారంటే ఆ పోరాటం ఎవరి మీద? అంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు. విషయం ఏమైనా ఉంటే చర్చకు రండి, ప్రజల మీద యుద్ధం చేయవద్దు అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.