టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ కూడా సహకరించడం లేదని బాంబు పేల్చారు. ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప్రధాన్యతను ఇస్తున్నారని ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పని చేసిన వారిని రాష్ట్ర అధినాయకత్వం పూర్తిగా విస్మరించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జెండా కూడా పట్టని వాళ్లకు పదవులు కట్టబెడుతుండటం బాధకరమని ఇదే విషయంపై తాను గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ చాంబర్ ఎదుట బైఠాయించి ప్రశ్నిస్తే తప్పేంటని అన్నారు.
పార్టీలో ఉన్న 30 మంది మహిళలకు పదవులు ఇస్తామని చెప్పారని ఇప్పుడేమో కేవలం ఇద్దరికి మాత్రమే ఇస్తామని అనడం కరెక్ట్ కాదని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం విజయశాంతి ఏం కష్టపడ్డారని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఈ విషయంలో పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఇంట్లోనే ఇద్దరికి రెండు పదువులు వచ్చాయని తనతో పాటు తోటి మహిళా నేతలు పదవులు ఆశిస్తే తప్పేంటని అన్నారు. తనపై ఒకవేళ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తన ప్లాన్ తనకుందని సునీతా రావు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.