ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏనుగుల గుంపుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఏనుగులను గ్రామాల వైపు రాకుండా ఉంచేందుకు కూటమి ప్రభుత్వం గతంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని కుంకీ ఏనుగులను ఏపీకి పంపించే విధంగా కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
తాజాగా రాష్ట్రంలో ఏనుగుల గుంపుల దాడులు పెరిగిపోతుండటంతో ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరుకు వెళ్తున్నారు. కుంకీ ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. కాగా ఈ రోజు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ఏపీకి అప్పగించనుంది. ఈ నిర్ణయంతో అటవీ ప్రాంత గ్రామాలకు ఏనుగుల గుంపు బెడద తగ్గే అవకాశం ఉంది.