విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన ఓ యువకుడు. చివరికి తిరిగిరాని లోకానికి వెళ్లాడు. కళ్లముందే తన సోదరులు, తనతో నమ్మకంగా పనిచేసే యువకులు ప్రాణాలు పోతుంటే చలించుకుపోయిన చంద్రశేఖర్ ఎలాగైనా వారిని కాపాడాలని తన ప్రాణాలను మృత్యువుకే ఎదురెళ్లాడు. ఆ వరదలో చాలా సహసం చేసి తన ఇద్దరి సోదరులను, మరో ఇద్దరి యువకులను కాపాడి , డెయిరీఫాం షెడ్డు పైకప్పు పైకి చేర్చాడు. ఇక వారి ప్రాణాలతో పాటు నా ప్రాణాలను కాపాడుకుంటే సరిపోతుందని అనుకోలేదు చంద్రశేఖర్.
తమ జీవన ఆధారంగా నిలిచిన మూగజీవులను కూడా కాపాడాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తాళ్లతో కట్టి ఉంచిన 50 ఆవులను రక్షించేందుకు వెళ్లాడు. ఇక ఎక్కడో ఒకచోటు అవి కూడా ప్రాణాలతో ఉంటాయని భావించి వాటి తాళ్లను విడదీశాడు. ఆ తర్వాత నెమ్మదిగా తాను ఈదుకుంటూ వెనక్కి వచ్చి తన డైయిరీఫాం పై కప్పు ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ, దురదృష్టవశత్తు విధి ఆయనపై చిన్నచూపు చూసింది. ఆ నలుగురిని ప్రాణాలు కాపాడిన యువకుడు తన ప్రాణాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. పై కప్పు ఎక్కుతుండగా కాలుజారి కింద పడడంతో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అయితే మంగళవారం డెయిరీఫాంకు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం దొరికింది.