మెగా హీరో రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు ముందు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించడానికి వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. బెనిఫిట్ షోలను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలను అనుమతించడంతో టికెట్ల ధరలను మల్టిఫ్లెక్స్ లలో రూ.100, సింగిల్ థియేటర్లలో రూ.50పెంచుకోవడానికి అనుమతించింది.
ఈ నిర్నయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే గేమ్ ఛేంజర్, ఢాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలకు 10రోజుల పాటు అనుమతించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మాతల వినతుల మేరకు తొమ్మిది రోజుల పాటు బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుకు అనుమతినిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరల పెంపుకు అనుమతినివ్వడాన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.