సృష్టిలో అపురూపమైన అమ్మ కో రోజు కావాలని యావత్ ప్రపంచం మదర్స్ డేని జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం మే నెల రెండవ ఆదివారం నాడు మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. తల్లికి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుక మదర్స్ డే. ఈ రోజును మనం ప్రత్యేకంగా అమ్మకు అంకితం చేస్తాం. ఈ వేడుకకు ఆరంభం దాదాపు 117 సంవత్సరాల క్రితం,అమెరికాలో జరిగింది. అమెరికన్ మహిళ అన్నా జార్విస్ ఈ భావనకు పునాది వేశారు. 1907 మే నెల రెండవ ఆదివారం న ఆమె తల్లి జ్ఞాపకార్థంగా ఓ ప్రత్యేక ప్రార్థనా సభను నిర్వహించారు. ఇదే మదర్స్ డే ఆవిర్భావానికి మొదటి అడుగు. తర్వాత ఈ ఆలోచన అమెరికాలో విస్తరించి, ప్రతి ఏడాది మే రెండో ఆదివారాన్ని తల్లుల్ని స్మరించుకునే రోజుగా పాటించసాగారు. చివరకు 1914లో అమెరికా అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ దీనిని జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించారు.
ఈ మదర్స్ డే రోజున అమ్మకు కొంచెం విశ్రాంతిని ఇవ్వాలని భావిస్తే కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళవచ్చు. ఇలా కొత్త ప్రదేశాలకు తీసుకుని వెళ్ళడం అమ్మకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది . అంతేకాదు రోజూ చేసే పని నుంచి కొంతకాలం విరామం కూడా లభిస్తుంది. వాస్తవానికి అమ్మను బయటకు తీసుకెళ్లడానికి లేదా ఆమెను ప్రత్యేకంగా భావించడానికి ప్రత్యేక రోజు అవసరం లేదు. అయితే బిజీ జీవనశైలి కారణంగా అమ్మతో గడిపేందుకు సమయం కేటాయించడం చాలా కష్టం అవుతుంది. కనుక మదర్స్ డే రోజున తల్లితో పాటు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవడం మంచి ఎంపిక.