ఎర్రకోటపై ప్రధాని జాతీయపతాక ఆవిష్కరణ..

modi-15.jpg

దేశం ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రసంగించారు. ప్రధాని మోడీ ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రధాని ఎర్రకోటకు చేరుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగం ప్రారంభించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.”దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించే రోజు ఈ రోజు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుంది” అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

దేశం కోసం ప్రాణాలు వదిలిన మహనీయులకు ఈ దేశం రుణపడి ఉందన్నారు. దేశానికి స్వేచ్ఛావాయువులు అందించిన త్యాగధనుల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు. 40 కోట్ల మంది స్వతంత్రాన్ని సాధిస్తే.. 140 కోట్ల మంది ఎంతైనా సాధించవచ్చన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగదా అభివృద్ధి పథంలో వెళ్తున్నామన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందులు పెడుతున్నాయని ప్రధాని వెల్లడించారు.ఇటీవలి ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించారు. 

Share this post

scroll to top