మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎమ్మెల్యేల గౌరవం, ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ముఖ్యమంత్రి మాట్లాడారని, ఈ అంశంపై శాసన సభలో చర్చించాలని పేర్కొంటూ అసెంబ్లీ కార్యదర్శికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నోటీలులు అందజేశారు. అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం, కేటీఆర్ మధ్య సంవాదం కొనసాగుతున్నది వెంటనే అసందర్భంగా లేచిన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పీ చెప్పీ ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నడనుకో జూబ్లీ బస్టాండులో కూర్చోవాల్సి వస్తది’ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సీఎం మాట్లాడిన మాటలు యథాతథంగా.. ‘తాము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తామని కేటీఆర్ పదేపదే చెప్తున్నారు. కలిసి వస్తరా? లేదా? అనేది, అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక మెతుకును చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రానప్పుడు వీళ్లు కలిసి వస్తరంటే నమ్మేదెవరు? అందుకే నేను వారికి సూచన చేస్తున్నా.. కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు..’ అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో కేటీఆర్ వెనుక సీట్లో సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి కూర్చున్నారు. సీఎం వ్యాఖ్యలు సభలో వాయిదాలకు, ఆందోళనలకు, నిరసనలకు కారణమయ్యాయి.
మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం..
