బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఇవాళ హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్ పై ధర్నాకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను నిలువరిస్తున్నారు. గురువారం అర్థరాత్రి నుంచే నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం నార్సింగిలోని పుప్పాలగూడ క్రిన్స్ విల్లాలో ఉన్న ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితను కూడా గృహ నిర్భంధం చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ట్యాంక్‌బండ్ వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.