కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్‌ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఫార్ములా ఈ-రేస్ కేసుకన్నా ముందే అవకాశం దొరికితే ఆయనను అరెస్టు చేయాలనే ప్రయత్నాలు అనేకం జరిగాయి. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కేటీఆర్ సారధ్యంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఒత్తిడి చేస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సరార్‌పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరు గ్యారెంటీలపై అడిగితే అరడజనుసార్లు కేటీఆర్‌ను కేసుల్లో ఇరికించాలని సర్కార్ కత్తిగట్టిందని బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎక్కడా ఏమీ దొరక్కపోయేసరికి బ్యాంకు టు బ్యాంకు అదీ ప్రభుత్వంగా చేసిన లావాదేవీలను బూచిగా చూపి అవినీతికి ఆస్కారంలేని కేసని తెలిసినా కేటీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ టార్గెట్‌గా జరిగిన పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వానికి ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌పై కక్షసాధింపు పంతం ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.