తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తరువాత నిర్ణయం తీసుకుందామని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకోవటంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాగితాలు, వాటర్ బాటిల్స్ విసిరివేయడంతో సభలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.