కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ పర్యటనపై కేటీఆర్ మండిపడ్డారు. దేశం కోసం సర్వస్వం ధారపోసిన నేతలను అవమానపరిచే డీఎన్‌ఏ కాంగ్రెస్‌లోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే మహనీయులను అవమానపరచడం అని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయిన ఈ సమయంలో రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లడం ఆశ్చర్యకరంగా ఉందని కేటీఆర్ అన్నారు. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ చేసిన అవమానాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు. తమ పార్టీ, దేశం కోసం తమ జీవితాలను ధారపోసిన మహనీయులను అమానించడం కాంగ్రెస్‌కు అలవాటే అని విమర్శించారు.