తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా కులగణన చేపట్టాలి..

ys-sharmala-05.jpg

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఇదో చారిత్రాత్మక ఘట్టమని ఈ సర్వే యావత్ భారతవనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసించారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి తెలంగాణ కులగణన నిదర్శనమని వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం అన్నారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతుందన్నారు. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీయాలని మనమెంతో మనకంతా అన్నట్టుగా రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాల్లో వారి వాటా వారికి దక్కాలని జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని డిమాండ్ చేశారు షర్మిల.

Share this post

scroll to top