తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్న ఆయన తన జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే ఆలేరు నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో భాగంగా నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పర్యటన విషయానికి వస్తే ఇప్పటికే యాదగిరిగుట్ట హెలీప్యాడ్ వద్దకు కుటుంబ సమేతంగా చేరుకున్న రేవంత్ రెడ్డి 10 గంటల వరకు ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఉండి ఇప్పుడే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. 11:15 గంటల వరకు ఇక్కడ పూజలు నిర్వహించనున్నారు.