మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 

carona-21.jpg

నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మారి ఇప్పుడు మళ్లీ తన పంజా విసురుతోంది. సింగపూర్‌, హాంకాంగ్‌, చైనా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లో సైతం కోవిడ్-19 కలకలం రేపుతోంది. ప్రస్తుతం భారత్‌లో 257 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ తెలిపింది. ఇవి స్వల్ప లక్షణాలు గల కేసులని, వ్యాధిగ్రస్థులను ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స చేయవలసిన అవసరం లేదని వివరించింది.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 12 నుంచి 56కి పెరిగింది. అలాగే, ఈ ఏడాది జనవరి నుంచి ఇద్దరు కొవిడ్‌తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మరణాలు ముంబై నగరంలో నమోదయ్యాయని, మరణించిన ఇద్దరూ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారని తెలిపారు. ఇక జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,066 స్వాబ్ నమూనాలను పరీక్షించగా, వాటిలో 106 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 101 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావడం గమనార్హం. మిగిలిన కేసులు పుణె, థానే, కొల్హాపూర్ ప్రాంతాల్లో నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్‌ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇక దేశంలో అత్యధికంగా కేరళలో 95 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

Share this post

scroll to top