లడ్డూ కల్తీ వివాదంపై నిగ్గు తేల్చాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంతేగానీ, ఈ అంశం రాజకీయ ఆరోపణలతో ముడిపడి ఉండకూడదని చెప్పారు. ఇవాళ గుంటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీఐజీ స్థాయి అధికారిని వేసి, విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారని తెలిపారు. డీఐజీలాంటి వారిని వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇస్తారని చెప్పారు. డీఐజీ విచారణ అంటున్నారంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, హిందుత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాస్తవాలలో పసలేక ఇటువంటివి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రాయశ్చిత్త దీక్ష ఏంటని, ఎవరు చేయాలని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఇంతపెద్ద ఆరోపణపై డీఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తారా అంటూ ప్రశ్నించారు. సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటోందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ అపవిత్రం జరిగిందంటే మేం ప్రాయశ్చిత్తం చేస్తాం. తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతారని పేర్కొన్నారు. మేం తప్పుచేశామని నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తామని పేర్కొన్నారు.